Skip to content
శ్రీ నాంపల్లి బాబా వారి దివ్య అనుగ్రహము మరియు ప్రేరణతో శ్రీ నాంపల్లి బాబా వారి సమాధి మందిరము నందు శ్రీ గురు చరిత్ర సామూహిక ఏకాహ పారాయణ కార్యక్రమము 21-02-2016 నుండి ప్రతి ఆదివారము ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు జరుపబడుతున్నది. శ్రీ నాంపల్లి బాబా వారి సన్నిధిలో శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే శ్రీ దత్త మరియు బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు.
శ్రీ గురు చరిత్ర పారాయణ విశిష్టత
దత్త సంప్రదాయంలో మరియు గురు సంప్రదాయంలో శ్రీ గురు చరిత్ర పారాయణ అత్యంత ముఖ్యమైన సాధన. శ్రీ గురు,బాబా మరియు అవధూత భక్తులందిరికి శ్రీ గురు చరిత్ర పారాయణం ఎంతో ఆవశ్యకం.శ్రీ గురు చరిత్ర పారాయణం వల్లనే ఎందరో భక్తులకు శ్రీ షిర్డీ సాయి బాబా అనుగ్రహం మరియు ఆశీస్సులు లభించాయి. శ్రీ నాంపల్లి బాబా వారు దేహంతో ఉన్న కాలంలో ఎందరో భక్తులు శ్రీ గురు చరిత్ర పారాయణం వల్లనే వారి అనుగ్రహం పొంది శ్రీ బాబా వారి సేవ చేసుకున్నారు.
సామూహిక పారాయణ విశిష్టత
శ్రీ గురు చరిత్ర సద్గురువులు, అవధూతలు మొదలైన వారి దివ్య సన్నిధిలో పారాయణం చెయ్యటం వల్ల కొన్ని వేల రెట్లు పారాయణ ఫలితం పొందుతారు. మన పారాయణ కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా వారు అనుగ్రహిస్తారు. అంతేకాక ఎక్కడైతే శ్రీ గురు చరిత్ర వంటి పవిత్ర గ్రంధములు పారాయణ కార్యక్రమం జరుగుతుంటుందో అక్కడ శ్రీ దత్తనుగ్రహం నిరంతరం ఉండి భక్తులను అనుగ్రహించును. అంతేకాక శ్రీ గురు చరిత్ర వంటి దివ్య గ్రంధములు సామూహిక పారాయణం చేసిన భక్తుల సంకల్పాలను మరియు కోర్కెలను అతి తక్కువ సమయంలో అనుగ్రహించును. సామూహిక పారాయణం కార్యక్రమం వల్ల పారాయణ చేసిన వ్యక్తికే గాక ఆ ప్రదేశమునకు మరియు దేశమునుకు మంచి జరుగును.
శ్రీ గురు చరిత్ర సామూహిక పారాయణ సమయములు
శ్రీ గురు చరిత్ర సామూహిక పారాయణ కార్యక్రమము ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు జరుగును. భక్తులు వారి వారి సమయానుకూలంగా పారాయణ కార్యక్రమంలో పాల్గొనవచ్చును. శ్రీ గురు చరిత్ర సామూహిక పారాయణ కార్యక్రమములో పాల్గొన్న భక్తులందరికీ సంస్థానము వారిచే ప్రసాద వితరణ జరుగును.
సూచనలు:
1.భక్తులు ఎవరి గ్రంధము వారే తెచ్చుకోవాల్సిందిగా విన్నపం.
2.పారాయణ ప్రారంభించేముందు శ్రీ బాబా వారికీ 11 ప్రదక్షిణాలు చేసి పారాయణ చెయ్యటం అత్త్యుత్తము.
3.పారాయణ చేసే సమయంలో పూర్తి మౌనం పాటించి పారాయణ మీద మాత్రమే శ్రద్ద ఉంచి పారాయణ చేసిన అద్భుత ఫలితాలు పొందవచ్చును.
4.హారతి జరుగు సమయంలో పారాయణ చేయరాదు.
5.శ్రీ గురు చరిత్ర పారాయణ చేసే భక్తులు వారి శక్తి కొలది ఆహార నియమములు పాటించవచ్చును.
6.ఆహార నియమములు పాటించలేని భక్తులు సంస్థానము వారు ఏర్పాటు చేసిన ప్రసాదం స్వీకరించి పారాయణం చేయవచ్చును.
7.ఆదివారం గురు చరిత్ర పారాయణం చేసిన వారికీ అవసరమైతే గుడి దగ్గర నుండి మెయిన్ రోడ్ వరకు వాహనము ఏర్పాటు చేయబడును.
ఎందుకు ఈ గురు చరిత్ర పారాయణ కార్యక్రమం
సాక్షాత్తు శ్రీ దత్త స్వరూపులైన అవధూతలు మరియు మహాత్ముల అనుగ్రహ ఆశీస్సులు పొందటానికి ఏకైక అద్భుత మార్గం శ్రీ గురు చరిత్ర పారాయణం.ఈ విషయం మనం శ్రీ సాయి చరిత్రలో స్పష్టంగా గమనించవచ్చు. ఎందరో భక్తులు శ్రీ సాయి అనుగ్రహమునకు పాత్రులు కావడానికి శ్రీ గురు చరిత్ర పారాయణం దోహదం చేసింది.అంతేకాక ప్రత్యక్ష కాలంలో శ్రీ దత్తాత్రేయుని ఆరవ అవతారంగా ఎందరో మహాత్ములతో కీర్తించబడిన శ్రీ నాంపల్లి బాబా వారి సన్నిధిలో కూడా నిరూపితమైనది. భారత దేశ ఉన్నతి మరియు భావితరముల క్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం శ్రీ నాంపల్లి బాబా వారి దివ్య ప్రేరణ మరియు ఆదేశములతో ప్రారంభించిన ఈ దివ్య కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై శ్రీ దత్తుని మరియు శ్రీ బాబా వారి దివ్య ఆశీస్సులు మరియు అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్ధన. సరిగ్గా ఒకే సమయమునకు ప్రపంచమంతట శ్రీ గురు చరిత్ర పారాయణ జరగటం వలన శ్రీ గురుని అనుగ్రహం చేత సకల శుభములు పొందగలరు.
శ్రీ నాంపల్లి బాబా వారి మందిరమునకు దగ్గరగా ఉన్న భక్తులు మరియు హైదరాబాద్ లో ఉన్న భక్తులు మందిరమునకు వచ్చి పారాయణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విన్నపం. ఏ కారణం చేత గాని లేక దూర ప్రదేశంలో ఉన్న భక్తులు వారి వారి గృహములో ప్రతి ఆదివారం సరిగ్గా ఉదయం 8 గంటలకు పారాయణ చేయగలరు. పారాయణ చేయడానికి ముందు శ్రీ బాబా వారి చిత్ర పటమును ఉంచి బాబా వారే స్వయంగా ఉన్నారు అని గుర్తించి మొదట 11 ప్రదిక్షణలు చేసి పారాయణ చేయగలరు.